: దీప్తి హత్య కేసులో తల్లిదండ్రుల అరెస్ట్
గుంటూరులో ఆదివారం జరిగిన దీప్తి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులే నిందితులని తేలింది. కులాంతర వివాహం చేసుకున్నందున కన్న కూతురిని గొంతు నులిపి చంపేసినట్లు ఆమె తల్లిదండ్రులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో పి.హరిబాబు, సామ్రాజ్యం దీప్తిని గొంతు నులిపి హత్యచేశారు. ఘటన జరిగినప్పటి నుంచి వారు పరారీలో ఉన్నారు. ఈరోజు గుంటూరు సమీపంలోని ఓ గ్రామంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టీ తెలిపారు.
2010 నుంచి దీప్తి హైదరాబాదులోని ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. తన సహోద్యోగి కిరణ్ కుమార్ తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీప్తి పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఈ నెల 21వ తేదీన వారు ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం దీప్తి తల్లిదండ్రులు వారిని గుంటూరు రావాలని కోరడంతో నవ దంపతులిద్దరూ గుంటూరుకు వెళ్లారు. దీప్తి ఇంటికెళ్లిన తర్వాత హత్యకు గురైంది. పోలీసులు కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.