: స్పెషల్ కమెండో... చేసేది బైక్ ల చోరీ
మణిపూర్లోని ఓ పోలీస్ కమెండో ఉన్నదాంతో సంతృప్తి పడక పెడదారి పట్టాడు. మహ్మద్ ఫక్రుద్దీన్ అనే యువకుడు మణిపూర్ పోలీస్ విభాగంలో స్పెషల్ కమెండోగా పనిచేస్తున్నాడు. మణిపూర్ యువతకు హై స్పీడ్ బైక్ లంటే ఉన్న పిచ్చిని గమనించిన ఫక్రుద్దీన్ తన ప్రణాళికను అమల్లోపెట్టాడు. వారాంతంలో ఢిల్లీ వెళ్ళడం... అక్కడ స్పోర్ట్స్ బైక్ లను గుర్తించి తస్కరించడం... గతకొన్నాళ్ళుగా ఇదీ వరుస. ఈ పోలీసుదొంగకు సత్యజిత్ శర్మ అనే సైన్స్ గ్రాడ్యుయేట్ సహకరించేవాడట. దొంగిలించిన ద్విచక్రవాహనాలను వీరు ట్రైన్ ద్వారా మణిపూర్ రవాణా చేసేవాళ్ళు.
మార్చి 21న వీరిద్దరూ మరో వ్యక్తితో కలిసి ఢిల్లీలోని ఆర్కే పురంలో ఓ బైక్ కొట్టేశారు. అది కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉద్యోగిది. ఆ ఉద్యోగి కూడా మణిపూర్ కు చెందినవాడే. ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు తోడు దొంగలిద్దరినీ పట్టేశారు. వీరికి సహకరించిన మూడో వ్యక్తి పరారయ్యాడు.
ఫక్రుద్దీన్ విషయాన్ని పోలీసులు మణిపూర్ పోలీస్ శాఖకు సమాచారం అందించగా, వాళ్ళు అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు ఫక్రుద్దీన్ నివాసం నుంచి పెద్ద సంఖ్యలో బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. అతడు ఆ ఖరీదైన బైక్ లను మణిపూర్లో కేవలం రూ.20,000-30,000కే విక్రయించేవాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.