: బంగ్లాదేశ్ లో వందేళ్ల నాటి హిందూ ఆలయం ధ్వంసం
వందేళ్ల చరిత్ర ఉన్న హిందూ ఆలయాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. అనంతరం అక్కడ నిప్పు పెట్టారు. ఈ ఘటన నిన్న (శుక్రవారం) బంగ్లాదేశ్ లోని బగర్ హత్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జిల్లాలోని స్థానిక నవా పాషా జమీందార్ బర్హీ కుటుంబానికి చెందిన ఆలయాన్ని గుర్తు తెలియని ఆగంతుకులు ధ్వంసం చేశారు. ఆలయం లోపల నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించానని... వెంటనే సహాయం కోసం అరిచానని పూజారి ప్రదీప్ భట్టాచార్య చెప్పారు. వెంటనే పక్కవారు రావడంతో మంటలను ఆర్పేసినట్లు వివరించారు. కొంతమంది దుర్మార్గులు ఆలయంలోని దుర్గ, లక్ష్మి, సరస్వతి, కార్తీక్ విగ్రహాలను ధ్వంసం చేసి నిప్పంటించారని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.