: నమ్మిన వారి కోసమే పార్టీ మారుతున్నా: డీఎల్
35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. కమలాపురంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో కొనసాగాలా? వద్దా? అని ప్రజాబ్యాలెట్ నిర్వహించానని, టీడీపీలో చేరమని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారని అన్నారు. '35 ఏళ్లుగా నన్ను నమ్మిన వారి కోసమే పార్టీ మారుతున్నాను' అని స్పష్టం చేశారు. తనకు పదవులు కొత్త కాదని, పదవులకోసం తానేనాడూ రాజకీయం చేయలేదని డీఎల్ తెలిపారు.
వైఎస్సార్సీపీ అధినేత జగన్ తో కలిసి పని చేయడం కుదరదని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న డీఎల్, ఇప్పటికే వైఎస్సార్సీపీలో చేరిన వారు బయటికి వస్తున్నారని అన్నారు. పార్టీ అధిష్ఠానం తనకు ఏ పాత్ర ఇస్తే దానిని సమర్థవంతంగా పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.