: రాజస్థాన్ నుంచి అజహరుద్దీన్ పోటీ... కల్మాడీకి టికెట్ నిరాకరణ
లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 58 మంది అభ్యర్థుల పేర్లతో ఈ జాబితా ప్రకటించింది. మొదట 59 స్థానాలకు పేర్లను ప్రకటించినా.. వెంటనే జాబితా నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అల్లుడు పరాంజయాదిత్య సిన్హ్ పర్మార్ పేరును నిలిపివేసింది. కామన్ వెల్త్ క్రీడల కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లొచ్చిన సురేశ్ కల్మాడీకి ఈసారి టికెట్ నిరాకరించింది. ఆయన స్థానం (పుణె)లో విశ్వజిత్ కథమ్ అనే యువనేతను పోటీకి దింపుతోంది. ఇక మాజీ క్రికెట్ అజహరుద్దీన్ పోటీచేసే ప్రాంతం ఈసారి మారింది. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ సిట్టింగ్ ఎంపీ అయిన అజహర్ కు ఈసారి రాజస్థాన్ లోని టాంక్ సవాయ్ మాధోపూర్ టికెట్ ఇచ్చింది. మూడవ జాబితాతో కాంగ్రెస్ ఇప్పటి వరకు 318 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లోక్ సభ అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో ప్రకటించవచ్చని సమాచారం.