: ఆ విమానంతో భారత్ పై దాడి అనడానికి ఆధారాల్లేవు: ఖుర్షీద్
2001లో విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని డబ్ల్యూటీవో టవర్స్ పై అల్ కాయిదా ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే.. భారత్ లోని ఏదేనీ ఒక నగరంపై దాడికి వీలుగా మలేసియన్ విమానాన్ని హైజాక్ చేసి ఉంటారంటూ వచ్చిన వార్తల్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అందుకు ఎలాంటి సంకేతాలు లేవని విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. నిఘా సంస్థలు ఈ దిశగా దర్యాప్తు చేస్తాయన్నారు.
అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని, సహాయక చర్యలో భారత్ అన్ని రకాలుగా సాయం అందిస్తుందన్నారు. ప్రస్తుతానికైతే హిందూ మహాసముద్రంలో విమానం కోసం అన్వేషణ పనులు ముగిశాయని చెప్పారు. మరోవైపు విమాన అదృశ్యంలో మరో కొత్త విషయం వెలుగు చూసింది. విమానంలో సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయకుండా పోయిందంటూ పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు మలేసియా అధికారులు వెల్లడించారు. విమానం హైజాక్ వెనుక పైలట్ హస్తం కూడా ఉండి ఉండవచ్చంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో వాటిని ఖండించేలా ఈ విషయం ఉండడం గమనార్హం.