: పేదలకు కడుపు అనేది ఒకటి ఉంటుందన్న విషయం కాంగ్రెస్ కు తెలియదు: మోడీ


పేదలకు కడుపు అనేది ఒకటి ఉంటుందని, దానికి ఆకలి కూడా వేస్తుందనే విషయం 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ కు ఏమాత్రం తెలియలేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. మధ్యప్రదేశ్ లోని సంబల్ పూర్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన 'విజయ్ సంకల్ప్ సమావేశ్'లో ఆయన మాట్లాడుతూ, ఆహారభద్రత బిల్లు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి 60 ఏళ్లు పట్టిందని అన్నారు. ప్రపంచం దూసుకుపోతోందని, ఆదీవాసీలు వెనకబడి ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ పాలన అని ఆయన మండిపడ్డారు.

ఆదివాసీల హక్కుల కల్పనకు అటల్ బీహారీ వాజ్ పేయి ప్రభుత్వం పునాది వేసిందని ఆయన అన్నారు. వాజ్ పేయి పాలనలోనే గిరిజనాభివృద్ధి శాఖ ఉందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పేదలకు సేవ చేయలేదని అన్నారు. ప్రజల కన్నీళ్లు తుడవడానికి తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ధరలను నియంత్రిస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి దేశం గుణపాఠం చెప్పాలనుకుంటోందని మోడీ అన్నారు. పేదలకు జీవించే హక్కు కల్పించాలని, తల్లీ చెల్లీ సగౌరవంగా బ్రతకాలనుకుంటున్నారని అందుకు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. రైతులకు సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు భూముల కేటాయింపులు అక్కర్లేదని, రాయతీలు కల్పిస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజలకోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బంద్ చేస్తే అధికారంలో ఉన్న కేంద్రానికి కనీసం పట్టలేదని ఆయన మండిపడ్డారు. రైతుల బాధలు కేంద్రం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు. రైతులు చావనీ... వాళ్ళు వున్నా మనకు ఓట్లు వేయరని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల బాధలు పట్టించుకునే తీరిక కాంగ్రెస్ పార్టీకి లేదని, మోడీ ఎక్కడ అధికారంలోకి వస్తాడోనని వాళ్లు బాధపడుతున్నారని ఆయన విమర్శించారు. తాను దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం తన తప్పులు వెతకడంలో బిజీగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

వారు మాట్లాడే భాష ఎలాంటిదని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో అత్యున్నత ప్రజాస్వామ్యదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన ఎలా ఉందో ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎన్నికల కమిషన్ భారత ఎన్నికల కమిషన్ ను లండన్ లో తూలనాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భారాన్ని ఎన్నికల కమిషన్ మీద తోసేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News