: తమిళనాడు థియేటర్లలో జయలలిత సినిమా సందడి
ఎన్నికల వేళ తమిళ ఓటర్లను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత హీరోయిన్ గా తెరముందుకు రానున్నారు. 1965లో జయలలిత కథానాయికగా నటించిన 'ఆయిరతిల్ ఒరువన్' అనే సినిమా సరికొత్తగా మరోసారి ధియేటర్ల ముందుకు రాబోతోంది. ఎంజీఆర్ రెండు చేతుల నడుమ... వయ్యారాలు పోతున్న జయలలిత పోస్టర్లు కోయంబత్తూరు వ్యాప్తంగా వెలిశాయి. దీనిపై ఎలక్షన్ కమిషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిత్రం విడుదలను తాము అడ్డుకోలేమని, పోస్టర్లు మాత్రం ఎన్నికల కోడ్ కు విరుద్ధమని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. నిజానికి ఇది అప్పట్లో 35ఎంఎం చిత్రం కాగా, ఇప్పుడు సినిమాస్కోప్ లోకి మార్చారు. ఈ నెల 14న తమిళనాడు, కర్ణాటక వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అయితే, ఈ సినిమా విడుదలలో రాజకీయ ప్రయోజనాలు లేవని దివ్య ఫిలింస్ అధినేత చొక్కలింగం తెలిపారు.