: బీజేపీలో చేరిన ఆర్జేడీ రెబల్ నేత
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత రామ్ కృపాల్ యాదవ్ ఈ రోజు బీజేపీలో చేరారు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆయన్ను ఆహ్వానించారు. అనంతరం లాలూ రాజకీయాలపై దుమ్మెత్తిపోశారు. '35ఏళ్లుగా ఆర్జేడీ నిర్మాణం కోసం కార్యకర్తగా లాలూతో కలసి పనిచేశాను. లాలూ తన కుటుంబ సభ్యులకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వడం పెరిగిపోయింది. కుటుంబ న్యాయం కంటే సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. బీహార్లో బీజేపీ పటిష్ఠత కోసం పనిచేస్తా. లౌకికవాదం విషయంలో రాజీ పడను' అని చెప్పారు.
రామ్ కృపాల్ యాదవ్ బీహార్లోని పాటలీపుత్ర లోక్ సభ టికెట్ ను ఆశించారు. లాలూ ఆయన్ను కాదని పెద్ద కూతురు మిశా భారతికి ఆ టికెట్ ఇవ్వడంతో ఆగ్రహించిన రామ్ కృపాల్ యాదవ్ ఆర్జేడీని వీడారు. బీజేపీ తరపున పాటలీపుత్ర లోక్ సభ స్థానం నుంచి పోటీచేయనున్నారు. ఈయన చేరికతో లాలూకు సంప్రదాయంగా ఉండే యాదవుల ఓట్లు తమకు కొంతైనా లభిస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది.