: మైగ్రేన్ ను నివారించే తలపట్టీకి అమెరికా ఆమోదం
మైగ్రేన్ తలనొప్పి వస్తే ఆ సమయంలో పడే బాధ వర్ణణాతీతం. ముఖ్యంగా మహిళలను ఈ తలనొప్పి ఎక్కువగా వేధిస్తుంటుంది. ఈ భయంకరమైన తలనొప్పిని నివారించేందుకు ప్రపంచంలో తొలిసారిగా ఓ తలపట్టీ అందుబాటులోకి వచ్చింది. బెల్జియంకు చెందిన సెఫలీ టెక్నాలజీ అనే కంపెనీ సెఫలీ పేరుతో దీన్ని తయారు చేసింది. దీనికి అమెరికా ఆహార, ఔషధ ప్రమాణాల నియంత్రణ మండలి (యూఎస్ ఎఫ్ డీఏ) అనుమతి జారీ చేసింది.
మందులు వాడలేని వారికి ఇదొక ప్రత్యామ్నాయ నివారిణిగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్ బ్యాండ్ ను తల చుట్టూ పట్టీలా ధరించాలి. బ్యాటరీ సాయంతో సూక్ష్మ విద్యుత్ తరంగాలు మెదడుకు ప్రసారమవుతాయి. ఇవి మైగ్రేన్ నొప్పికి కారణమయ్యే నరాలను ప్రేరేపిస్తాయి. దాంతో ఆ ప్రాంతంలో తిమ్మిరిలా అనిపిస్తుంది. 18 ఏళ్లు నిండిన వారు రోజులో 20 నిమిషాలకు మించకుండా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని వాడిన వారికి మిగతా వారితో పోలిస్తే ఒక నెలలో తక్కువ సార్లు మైగ్రేయిన్ తలనొప్పి వచ్చినట్లు యూఎస్ ఎఫ్ డీఏ పరిశీలనలో తేలడంతో.. దీనికి అనుమతి మంజూరు చేసింది.