: ద్రావిడ్ వారసుడిగా షేన్ వాట్సన్ ఎంపిక
దేశంలో ఓవైపు ఎన్నికల వేడి రాజుకుంటుండగా, మరోవైపు ఐపీఎల్ క్రికెట్ సీజన్ తరుముకొస్తోంది. కాగా, గతేడాది అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు రాహుల్ ద్రావిడ్ ప్రకటించిన నేపథ్యంలో ఐపీఎల్-7కు గాను రాజస్థాన్ రాయల్స్ సారథిగా షేన్ వాట్సన్ ను ఎంపిక చేశారు. గత సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించిన ద్రావిడ్ ఈసారి జట్టుకు సలహాదారుగా వ్యవహరిస్తాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో రాయల్స్ జట్టు టైటిల్ గెలవడంలో విశేష పాత్ర పోషించిన వాట్సన్ పై రాజస్థాన్ ఫ్రాంచైజీ నమ్మకముంచింది.
తనను సారథిగా ఎంచుకోవడం పట్ల వాట్సన్ స్పందిస్తూ, రాయల్స్ జట్టు అసాధారణమైనదని, కెప్టెన్ గా ఎంపికవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. తమ జట్టు ఓ కుటుంబంలాంటిదని పేర్కొన్నాడీ ఆసీస్ క్రికెటర్. ఇక, వాట్సన్ ను కెప్టెన్ గా నియమించడం పట్ల ద్రావిడ్ స్పందిస్తూ, అభినందనలు తెలిపాడు. వాట్సన్ సమకాలీన క్రికెట్లోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడని, అతనిలో నాయకత్వ లక్షణాలకు కొదవలేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.