: యూపీఏ ప్రభుత్వంలో ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో!: వెంకయ్యనాయుడు
తిరుపతిలో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ‘మోడీ ఫర్ పీఎం’ బహిరంగసభ ప్రారంభమైంది. ఈ సభలో బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు, పురంధేశ్వరి, సినీనటుడు కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పోవాలి, బీజేపీ అధికారంలోకి రావాలని దేశంలో ప్రజలందరూ కోరుకుంటున్నారని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు చెప్పారు. యూపీఏ పాలనలో ఎటు చూసినా కుంభకోణాలేనని ఆయన అన్నారు. ప్రధాని మన్మోహన్ ప్రభుత్వ పాలనలో ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తే, ప్రజలు పాతాళంలో ఉన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న ఎన్నికలు సాధారణమైనవి కావని, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ఆయన అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు.