: ఉమెన్స్ డే స్పెషల్: ఆమె చదివింది ప్రాథమిక విద్యే, కానీ ఐఏఎస్ అధికారులకు అభివృద్ధి పాఠాలు చెబుతోంది!


ఆమె చదివింది ప్రాథమిక విద్య, కానీ కాబోయే ఐఏఎస్ అధికారులకు పాఠాలు నేర్పిస్తోంది. మహిళా సంఘాల ఏర్పాటుపై, సభ్యుల ఆర్థికాభివృద్ధిపై శిక్షణ ఇచ్చి ప్రశంసలు అందుకొన్నారు. మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన ఆమె పేరు మల్లమ్మ. ఆమె నివసించేది అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల పరిధిలోని రోటరీపురం. మల్లమ్మ మంచి దిగుబడులు సాధించి సాగులోనూ సత్తా చాటారు. ఆదర్శ రైతు అవార్డు కూడా అందుకున్నారు. తొలుత మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలిగా చేరిన ఆమె... తర్వాత గ్రామ సంఘం నాయకురాలిగా ఎదిగారు. సంఘాల ఏర్పాటుతో పాటు, పొదుపు, బ్యాంకు రుణాల ద్వారా సభ్యులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఆమె ముందున్నారు.

కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా ఎంపికైన మల్లమ్మ మహిళా సంఘాల ఏర్పాటు, ఆవశ్యకతపై చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లా, పశ్చిమగోదావరి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అవగాహన కల్పించారు. ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) సహకారంతో ఆమె హిందీ కూడా నేర్చుకున్నారు. 2012వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలో ఒకటి, రెండూ కాదు... ఏకంగా 182 మంది ఐఏఎస్ అధికారులకు మహిళా సంఘాలపై శిక్షణ ఇచ్చారు. సంఘాల స్థాపన, వాటి ద్వారా మహిళలు ఎలా ఆర్థికాభివృద్ధి సాధించారనే దానిపై కేస్ స్టడీలతో సహా శిక్షణ ఇచ్చిన ఆమె అందరి మన్ననలు అందుకున్నారు. వినూత్న పద్థతుల ద్వారా వరి, వేరుశనగ పంటల్లో మంచి దిగుబడులు సాధించిన మల్లమ్మను... 2013లో కృషి విజ్ఞాన కేంద్రం మహిళా ఆదర్శ రైతుగా ఎంపిక చేసింది.

  • Loading...

More Telugu News