: వెల్లుల్లి తినాల్సిందే...!
వెల్లుల్లిలో ఉన్న ఔషధ గుణాల విశిష్టత అనాదిగా విరివిగా ప్రచారంలో ఉంది. యాంటివైరల్, యాంటి ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్... ఇలా, ఎలా చూసినా వెల్లుల్లి శక్తి అపారం, అమోఘం. నేటి వైద్యులు సైతం అదే మాట చెబుతారు. వెల్లుల్లి నిత్యం తీసుకుంటే వ్యాధులు దరిచేరవని, హృద్రోగాలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని డాక్టర్లు సూచిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కీలక భాగాల లోపలి పూతను పరిరక్షించడమే కాకుండా, చెడు కండర కణజాలం తయారవ్వకుండా నిరోధిస్తాయి. అంతేనా, రక్తపోటును తగ్గించడంలోనూ వెల్లుల్లిది కీలకపాత్రే.
బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎన్నదగిన నేస్తంగా దీన్ని పేర్కొనవచ్చు. ఇవే కాదండోయ్, మనల్ని తరచూ వేధించే జలుబు, ఫ్లూ జ్వరం వంటి సీజనల్ వ్యాధులతోనూ వెల్లుల్లి పోరాడి మన వ్యాధి నిరోధక శక్తికి ఇతోధికంగా సాయపడుతుందట.