: ఆకాశంలో సగం కాదు, ఆకాశమే 'ఆమె'లో సగం!
'స్త్రీ ఆకాశంలో సగం కాదు, ఆకాశమే ఆమెలో సగం'... ఇంత భారీ ఉపమానం ప్రయోగించకపోతే మహిళ ఔన్నత్యాన్ని తక్కువ చేసినట్లే. పురుషుడికి ఎందులో తక్కువ? అని ప్రశ్నిస్తే, అన్నింటా ఎక్కువే అన్న సమాధానం నేటితరం మహిళ నుంచి వినవస్తుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, శాస్త్రసాంకేతిక రంగం, వైద్య, విద్య... ఇలా ఏ రంగం చూసినా నేడు మహిళల ముద్ర ప్రస్ఫుటం. పైగా ఇంటి పనులు, పిల్లల్ని కనడం, శారీరక బలహీనతలు ఇన్నింటిని అధిగమిస్తూ పురుషుడికి దీటుగా రాణించడం మామూలు విషయం కాదు కదా! కానీ, పురుషాధిక్య ప్రపంచంలో 'ఆమె'కు సముచిత స్థానం లభిస్తోందా? అన్నిది నేటికీ ప్రశ్నార్థకమే.
ప్రతిభాపాటవాల రీత్యా స్త్రీని గౌరవిస్తున్నారే కానీ, ఆమెలోని స్త్రీత్వానికి విలువేదీ? ఆ విలువే ఉంటే ఆమెపై అఘాయిత్యాలు, గృహహింస ఎందుకు చోటు చేసుకుంటాయి? పురుషులు తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఓ మగ మహారాజు ఇంటిలో ఏమీ తోచడం లేదని బయట పిచ్చాపాటీగా తిరిగి రావచ్చు. ఇది ధర్మసమ్మతం అని సమాజం నమ్మిక. అదే ఓ ఇల్లాలు తనకు ఇంట్లో ఏమీ తోచడంలేదని బయటికెళ్ళి ఓ టీ స్టాల్ వద్ద టీ తాగి రావడం సాధ్యమయ్యే పనేనా? అలా తనకిష్టమైన చోటికి వెళ్ళివచ్చే మహిళకు ఆమె పతిదేవుడు ఎంతో గొప్పగా 'సన్మానం' చేస్తాడు! మహిళలందరికీ ఏదో ఒక సమయంలో ఈ 'సత్కారం' మాటలు, చేతల రూపంలో అనుభవంలోకి వచ్చే వుంటుంది. సంఘం కూడా ఆమెను ఉద్దేశించడానికి 'ప్రత్యేక'మైన మాటలు ప్రయోగిస్తుంది.
ధిక్కరించకూడదు, లోబడి ఉండాలి... ఇలా ఉంటుంది స్త్రీపై పురుషుడి అభిప్రాయం. ఎన్నేళ్ళిలా...? అతివలు కూడా కాలంతో పాటే దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో మగవారిని సైతం వెనక్కినెడుతున్నారు. పురుషుడికి శారీరక సుఖాన్నిచ్చి, అతడికి వారసులనిచ్చి, అతడి కోసం ఒళ్ళు గుల్ల చేసుకునే స్త్రీమూర్తికి అతడిచ్చే కానుక 'భద్రత'. అదీ తోటి పురుషుడి నుంచి ఆమెను కాపాడడమే భద్రత పేరిట అతడు నిర్వర్తించే విధి. అందరికీ ఇప్పుడదే పరమావధి.
వ్యక్తులు మారితే సమాజం మారుతుందన్న సూత్రాన్ని పాటిస్తే స్త్రీకి పురుషుడు రక్షణ కల్పించాల్సిన అగత్యం, తద్వారా ఆమె ఒకరికి లోబడి ఉండాల్సిన దౌర్భాగ్యం తప్పుతాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. పురుషవరేణ్యులు ఈ సందర్భంగానైనా ఆ జ్ఞానాన్ని కాస్తైనా అందిపుచ్చుకుంటారని ఆశిద్దాం.