: 56 ఏళ్లలో 27 సార్లు పోటీ.. గెలిచింది లేదు
ఆయనొక నేత! కానీ ప్రజామోదం కలిగిన నేత మాత్రం కాదు. ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడు కాదు. ఈ దేశంలోనే అత్యధిక పర్యాయాలు పోటీ చేసిన వ్యక్తిగా రికార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే 1957 నుంచి ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు ఇలా వివిధ రకాల ఎన్నికల్లో 27 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. ఇందులో 17 సార్లు లోక్ సభకు, 10 సార్లు అసెంబ్లీకి పోటీ చేశాడు. ఒక్కసారీ డిపాజిట్లు దక్కలేదులేండి.
ఈయన పేరే శ్యాంబాబు. వయసు 78ఏళ్లు. ఒడిశాలోని బెర్హంపూర్ లో నివాసం ఉంటాడు. తాజా ఎన్నికల్లో మరోసారి బెర్హంపూర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఇప్పటి నుంచే సైకిల్ పై ప్రచార యాత్ర ప్రారంభించాడు. ఈ నెల 15న తొలిరోజే బెర్హంపూర్ శాసనసభ స్థానానికి నామినేషన్ వేస్తానని, ఆ మరుసటి రోజే ఆస్కా లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయనున్నట్లు తెలిపాడు. చివరి శ్వాస వరకూ పోటీ చేస్తూనే ఉంటానని, ధన ప్రభావం లేని ఎన్నికలను కోరుకుంటున్నానని శ్యాంబాబు చెప్పాడు.