: భారత్ లో ఫార్ములా వన్ రేసుపై తొలగని అనిశ్చితి
ప్రతిష్ఠాత్మక ఫార్ములా వన్ కార్ రేసులకు ఈ ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే విషయంలో అనిశ్చితి నెలకొంది. భారత్ లో పన్నులు మోత మోగిస్తుండడంతో తాము ఇక్కడ రేసులు నిర్వహించలేమని ఫార్ములా వన్ యాజమాన్యం చేతులెత్తేసింది. ఫార్ములా వన్ అధినేత బెర్నీ ఎకిల్ స్టోన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ సమీపంలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో 2014 రేసు నిర్వహణ నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం ఈ కారు రేసులను ఓ క్రీడగా గుర్తించలేదు. దీన్ని వినోద అంశంగానే భావిస్తూ, ఆ కేటగిరీ కింద భారీ ఎత్తున పన్నులు వడ్డించింది. ఎలాగోలా రెండేళ్ళు నెట్టుకొచ్చిన ఫార్ములా వన్ యాజమాన్యం భారత్ అంటే భయపడే స్థాయికి చేరింది. దీనిపై ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్ సీఐ) చైర్మన్ అక్బర్ ఇబ్రహీం మాట్లాడుతూ, ఈ రేసులకు ప్రభుత్వ గుర్తింపు లభిస్తే సమస్యలన్నీ అవే సర్దుకుంటాయని అభిప్రాయపడ్డారు.