: ధీర వనితకు యాంకర్ గా అవకాశం
అమెరికా నుంచి ప్రపంచ ధీర వనిత అవార్డు అందుకున్న యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మికి టీవీ యాంకర్ అవకాశం వచ్చింది. 2005లో ఢిల్లీలో ఆమెపై స్నేహితురాలి సోదరుడు యాసిడ్ దాడికి పాల్పడగా.. ముఖంపై చర్మం బాగా కాలిపోయింది. తనను తిరస్కరించిన అందం ఆమెకు ఉండరాదన్న దుర్బుద్ధితో ఒక నీచుడు అలా దాడి చేశాడు. కానీ, ఆమె అందాన్ని కాల్చేసినా.. ఒక వార్తా చానల్ లక్ష్మికి యాంకర్ గా అవకాశం ఇస్తూ ముందుకు వచ్చింది. లక్ష్మికి టీవీ యాంకర్ కావాలన్నది చిన్న నాటి స్వప్నం. చిన్నప్పుడు తన ముఖాన్ని (అందంగా ఉండేది) అద్దంలో గంటల తరబడి చూసుకుంటూ ఎప్పటికైనా టీవీ యాంకర్ అవుతానని తల్లితో చెప్పేదట. కానీ ఓ కామోన్మాది ఆమె అందాన్ని చిదిమేశాడు. అయినా, ఆమె స్వప్నం ఇప్పుడు సాకారం అవుతోంది.
గతేడాది డిసెంబర్ లో ఓ వార్తా చానల్ లక్ష్మిని సంప్రదించగా.. ఆమె నమ్మలేకపోయింది. దానికి తాను తగిన దాన్ని కాదంటూ ముందు తిరస్కరించింది. కానీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనకిష్టమైన ఉద్యోగాన్ని చేయడానికి మానసికంగా సిద్ధమైందట. మూడు ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తయిందని.. త్వరలోనే సదరు కార్యక్రమం ప్రసారమవుతుందని సమాచారం. 'నువ్వు కాల్చేసిన ముఖాన్నే నేను ప్రేమిస్తున్నాను' అంటూ రెండు రోజుల క్రితం అమెరికా అంతర్జాతీయ ధీర వనిత అవార్డు స్వీకరణ సందర్భంగా లక్ష్మి చెప్పిన మాటలు అమెరికన్ల మనసులను గెలుచుకున్నాయి.