: కాంగ్రెస్ వ్యవహారశైలి బాధించింది... రేపు బీజేపీ అగ్రనేతలను కలుస్తా: పురంధేశ్వరి


కాంగ్రెస్ పార్టీని వీడి... బీజేపీలోకి వెళుతున్నట్టు పురంధేశ్వరి విశాఖలో మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు, నేతలలో ఉన్న మంచి సంబంధాల నేపథ్యంలో వారితో కూడా చర్చించడం జరిగిందని... వారంతా కూడా తాను బీజేపీలోకి వస్తేనే మంచిదని సూచించారని చెప్పారు. ఇదే విషయంపై ఇన్నాళ్లు తనను వెన్నంటి ఉన్న అభిమానులు, అనుచరులతో కూడా చర్చించానని... వారి అభిప్రాయాల మేరకు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

కొద్ది రోజుల క్రితం తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకున్నానని... అయితే తనను అభిమానించే వారందరు కూడా తన నిర్ణయాన్ని వ్యతిరేకించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడాలనుకోవడం తనకు వ్యక్తిగతంగా బాధాకరమైన నిర్ణయమేనని తెలిపారు. రేపు ఉదయం ఢిల్లీ వెళ్తున్నానని... బీజేపీ అగ్రనేత అద్వానీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ లను కలుస్తానని చెప్పారు. విశాఖకు వచ్చిన ఐదేళ్లలో ఇక్కడి ప్రజలందరూ తనకు మద్దతిచ్చారని అన్నారు.

సీమాంధ్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఈ సందర్భంగా పురంధేశ్వరి మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని దిగ్విజయ్ సింగ్ తనను అడిగిన తీరు కూడా తనను బాధించిందని చెప్పారు. విశాఖ నుంచే తాను మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీకి తాను ఎలాంటి షరతులు విధించనని... పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News