: ఈసారి ఎన్నికల్లో ఆధునిక ఈవీఎం యంత్రాలు: భన్వర్ లాల్
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఈ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల తీరుపై ఆయన వివరాలు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ఆధునికీకరించిన సరికొత్త ఈవీఎం యంత్రాలను వినియోగిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈ పర్యాయం 76 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారని వెల్లడించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 9 చివరి తేదీ అని స్పష్టం చేశారు. ఓటు హక్కు పొందడానికి ఇదే చివరి అవకాశమని తెలిపారు. కొత్త ఓటర్లకు కలర్ ఫొటోగ్రాఫ్ తో కూడిన వినూత్న స్మార్ట్ కార్డులను ఈ నెలాఖరులోగా అందజేస్తామని భన్వర్ లాల్ పేర్కొన్నారు. పాత ఓటర్లు కూడా స్మార్ట్ కార్డులను ఈసేవా కేంద్రాల్లో పొందవచ్చని సూచించారు. కాగా, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ అప్పులు, ఆస్తులు, కేసుల వివరాలను అఫిడవిట్లో తప్పక పేర్కొనాలని స్పష్టీకరించారు.