: 'స్పాట్ ఫిక్సింగ్' విచారణలో చండీలాకు మరికొంత సమయం
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో లిఖిత పూర్వక వివరణ ఇవ్వడానికి రాజస్థాన్ రాయల్స్ మాజీ క్రికెటర్ అజిత్ చండీలాకు బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఈ నెల 12 వరకు గడువు ఇచ్చింది. బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్, రాజీవ్ శుక్లా, శివ్ లాల్ యాదవ్ లతో కూడిన క్రమశిక్షణ కమిటీ ముందు ఈ రోజు చండీలా హాజరయ్యాడు. ఆరోపణల్లో నిజం లేదంటూ తనని తాను సమర్థించుకున్నాడు. లిఖితపూర్వక వివరణ ఇవ్వడానికి అదనపు సమయం కావాలని కోరాడు. దీంతో, చండీలా అభ్యర్థన మేరకు తుది వివరణ ఇవ్వడానికి ఈ నెల 12 వరకు గడువు ఇచ్చినట్లు బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ ఒక ప్రకటన జారీ చేశారు.
కమిటీ ముందు హాజరైన అనంతరం చండీలా మీడియాతో మాట్లాడుతూ.. 'వారి నిర్ణయం ఏంటో నాకు తెలుసు. నాపై జీవితకాల నిషేధం విధించవచ్చు. కానీ, నేనే తప్పూ చేయలేదు. వారు అడిగినట్లు 12లోపు వివరణ ఇస్తా. ఏం జరుగుతుందో చూద్దాం' అన్నాడు. బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం విచారణలో.. రాజస్తాన్ రాయల్స్ మాజీ ఆటగాళ్లు చండీలాతోపాటు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అమిత్ సింగ్, సిద్దార్ధ్ త్రివేది తదితరులు స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే.