: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతో యానాం వాసుల్లో ఆందోళన


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఇప్పటి వరకూ సీమాంధ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. ఇప్పుడు తెలంగాణ, సీమాంధ్రతో సంబంధం లేని ఒక ప్రాంతం కూడా ఈ విషయమై ఆందోళన చెందుతోంది. అదే యానాం పట్టణం. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగమైన ఇది తూర్పు గోదావరి జిల్లాకు దగ్గరగా ఉంటుంది. కాకినాడ నుంచి యానాంకు దూరం కేవలం 30 కిలోమీటర్లు.

తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే భౌగోళికంగా యానాంకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ, తమ జీవనాధారమైన గోదావరి జలాలు అందుతాయా? అన్నది అక్కడి ప్రజల ఆందోళన. ఒకప్పుడు ప్రెంచ్, బ్రిటిష్ పాలనలో ఉన్న యానాం భారతదేశంలో విలీనం సందర్భంగా.. ఈ ప్రాంతానికి 19 క్యూసెక్కుల గోదావరి జలాలను ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ తర్వాత ఈ వాటాను మన రాష్ట్ర ప్రభుత్వం 30క్యూసెక్కులకు పెంచింది.

మరి రేపు రాష్ట్రం విడిపోతే.. గోదావరి జలాల్లో తమ వాటాగా ఉన్న 30 క్యూసెక్కులు వస్తాయా? అన్న భయం వారిలో నెలకొంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధి మల్లాడి కృష్ణారావు కేంద్ర మంత్రుల బృందానికి తమ ఆందోళన కూడా తెలియజేశారు. విభజన చేస్తే.. ఉన్నత విద్యలో తమకు వాటా ఇవ్వాలని కోరారు. అలాగే, పర్యాటక ప్రాంతమైన యానాంకు రవాణా సదుపాయాలు పెరగడానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News