: అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం, తగ్గిపోతోంది..!
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రసాదం పరిమాణాన్ని తగ్గించాలని పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. సత్యదేవుని ప్రసాదానికి వినియోగించే దినుసుల ధరలు పెరగడంతో ఏడాదికి 25 లక్షల రూపాయల ఖర్చు పెరిగిందని ఆలయ ఈవో వెంకటేశ్వర్లు మీడియాతో చెప్పారు. ప్రసాదం తయారీ వ్యయం పెరగడంతో ప్రసాదం పరిమాణాన్ని తగ్గిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్ పది రూపాయలు కాగా, ఇక ముందు అదే రేటుకు 100 గ్రాములు ఇవ్వాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. బంగీ ప్రసాదాన్ని 15 రూపాయలకు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి, గోధుమలతో పాటు వంటగ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడంతో ప్రసాదం పరిమాణంపై వేటు వేయక తప్పలేదని ఈవో చెప్పారు.