: సీఎంగారూ.. మాలో చైతన్యం రగిల్చినందుకు థాంక్స్: ఈటెల


సడక్ బంద్ కు అనుమతినివ్వకుండా తెలంగాణ వాదాన్నిఅణగదొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ముఖ్యమంత్రి తమలో చైతన్యం రగిల్చారని, అదే తమలో పట్టుదల రేకెత్తించిందని, అందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్  అన్నారు. సడక్ బంద్ కార్యక్రమంలో అరెస్టయి నేడు బెయిల్ పై విడుదలైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తెలంగాణ జేఏసీ నేతలు జైలు నుంచి వెలుపలికి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, సడక్ బంద్ ను శాంతియుతంగా నిర్వహిస్తామన్నా ప్రభుత్వం అనుమతి నిరాకరించడం కుట్రపూరితంగా వ్యవహరించడమేనని ఆరోపించారు. ఇక సడక్ బంద్ సందర్భంగా తాము చిన్న రాయి కూడా విసరలేదని, ఎక్కడా ఒక్క అద్దం కూడా పగల్లేదని ఈటెల చెప్పారు. అయినా, డీజీపీ కుట్ర పన్ని తమను అక్రమంగా అరెస్టు చేయించారని తెలిపారు. తమను ఎనిమిది, తొమ్మిది గంటల సమయంలో అరెస్టు చేసి పదకొండు గంటలకు అరెస్టు చేసినట్టు చూపారని ఆయన వివరించారు.

తొలుత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తామని చెప్పి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇక జేఏసీ కన్వీనర్ కోదండరాం మాట్లాడుతూ, బెయిల్ సాధించుకోవడానికి పెద్ద ఎత్తున శ్రమపడాల్సి వచ్చిందని  వాపోయారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు.

అక్రమ అరెస్టులతో తెలంగాణ సాధన మరింత ఊపందుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తమను అన్యాయంగా జైల్లో పెట్టినా..  మహబూబ్ నగర్ కారాగారంలో ఖైదీలు, సిబ్బంది ఎంతో అపురూపంగా చూసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇక తమ బెయిల్ కోసం తీవ్రంగా కృషి చేసిన తెలంగాణ న్యాయవాదులకు పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. కాగా, జిల్లా జైల్లో సౌకర్యాల లేమి తీవ్రంగా ఉన్నట్టు కోదండరాం అన్నారు. 150 మంది సామర్థ్యం ఉన్న జైలును విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

  • Loading...

More Telugu News