: సంజయ్ దత్ కు పెరోల్ ఎలా పొడిగిస్తారు?: నానా పటేకర్
ముంబయి వరుస పేలుళ్ళ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు పదే పదే పెరోల్ పొడిగించడంపై ప్రముఖ క్యారెక్టర్ నటుడు నానా పటేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విధంగా సంజయ్ పెరోల్ ను పొడిగిస్తారని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ముంబయి పేలుళ్ళు 1993లో జరగ్గా, అప్పటి నుండి తాను అతనితో నటించలేదని తెలిపాడు. నేరస్తులుగా నిరూపితమైన వ్యక్తులతో తాను కలిసి పనిచేయనని స్పష్టం చేశాడు. భవిష్యత్తులోనూ సంజయ్ దత్ తో కలిసి నటించే ప్రశ్నేలేదని తేల్చి చెప్పాడు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించాడు. పెరోల్ పొడిగింపు న్యాయమేనని ప్రభుత్వ వర్గాలంటుంటే ఇంకేం మాట్లాడగలమని పటేకర్ ఆవేదన వ్యక్తం చేశారు.