: మహిళలే డ్రైవర్లుగా హైదరాబాదులో ‘షి క్యాబ్స్’ సర్వీసులు: మేయర్


గ్రేటర్ హైదరాబాదులో ప్రయోగాత్మకంగా ‘షి ట్యాక్సీ’ సేవలు ఆరంభమయ్యాయి. గురువారం సాయంత్రం ట్యాంక్ బండ్ లోని గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయంలో ఈ ట్యాక్సీని నగర మేయర్ మాజిద్ హుస్సేన్... జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ లతో కలసి ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత వారు ‘షీ క్యాబ్స్’లో హైదరాబాదులో ప్రయాణించారు.

ప్రారంభోత్సవం అనంతరం మేయర్ మాజిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. మారుతి సుజుకీ, గ్రీన్ క్యాబ్స్ తో చేసుకున్న ఒప్పందంతో ‘షి క్యాబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ క్యాబ్స్ ను తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు. అలాగే మహిళా ప్రయాణికుల కోసం ఆడవాళ్లే డ్రైవర్లుగా ఈ క్యాబ్స్ పనిచేస్తాయని, ట్యాక్సీల కోసం బ్యాంకుల ద్వారా జీహెచ్ఎంసీ రుణాలు మంజూరు చేయిస్తుందని ఆయన వెల్లడించారు. 15 శాతం ఖర్చును భరించగలిగే అభ్యర్థులకు, మిగిలిన 85 శాతం వ్యయాన్ని బ్యాంకుల ద్వారా మంజూరు చేయించనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో ‘షీ క్యాబ్స్’ ద్వారా 200 మందికి ట్యాక్సీలను బ్యాంకుల ద్వారా మంజూరు చేయిస్తున్నామని మేయర్ వెల్లడించారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ... మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ట్యాక్సీల్లో ప్రయాణించే మహిళా ఉద్యోగులకు భద్రత ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఐదు ట్యాక్సీలను ప్రారంభించామని ఆయన చెప్పారు. హైదరాబాదులో వీటిని 200కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ‘షీ క్యాబ్స్’లో మహిళలే డ్రైవర్లుగా ఉంటారని, 8వ తరగతి చదివిన మహిళలు వాహన చోదకులుగా జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News