: ఈ పండుతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టొచ్చు!
ఎర్రగా, నిగనిగలాడుతూ కనిపించే స్ట్రాబెర్రీలంటే ఎవరికి మాత్రం నోరూరదు! కచ్చితంగా తినాలనిపిస్తుంది. ఈ ఫలం అద్భుతమైన రుచినే కాదు, మేలైన ఔషధ గుణాలనూ కలిగి ఉంది. దీన్ని ప్రతి దినం తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ఇట్టే తగ్గిపోతుందట. ఇటలీలోని పొలిటెన్సియా యూనివర్శిటీ పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. కొందరు వలంటీర్లపై దీనికి సంబంధించి ప్రయోగాలు నిర్వహించారు. ఒక్కొక్కరితో రోజుకు అరకిలో చొప్పున స్ట్రాబెర్రీలను తినిపించారు. నెల రోజుల పాటు ఇలా చేసి అనంతరం వారి రక్తాన్ని పరీక్షించారు.
ఆశ్చర్యకరంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గిపోయింది. అంతేగాకుండా, రక్తంలోని ప్లేట్ లెట్ల సంఖ్య కూడా విశేషంగా వృద్ధిచెందింది. స్ట్రాబెర్రీలలోని బయోయాక్టివ్ కాంపౌండ్లు రక్త శుద్ధికి తోడ్పడతాయని, తద్వారా చెడు కొలెస్ట్రాల్ కు చెక్ చెప్పొచ్చని ఈ అధ్యయనానికి డైరక్టర్ గా వ్యవహరించిన మౌరీజియో బటినో తెలిపారు.