: వివాహంలో వివాదం... ఇద్దరి ప్రాణాలు తీసింది!
వివాహంలో అప్పటివరకు ఆనందంతో వారు ఆడుతూ పాడుతూ డాన్సులు చేశారు. మధ్యలో జరిగిన చిన్న వివాదం ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. చివరకు హింసాత్మకంగా మారి, ఇద్దరి ప్రాణాలు హరించివేసింది. ఈ ఘటన బీహార్లోని భోజ్ పూర్ జిల్లా పరిధిలోని అగియావ్ గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి జరిగిన పెళ్లి తంతులో పాటలకు స్టెప్పులేస్తుండగా గొడవ జరిగిందని తెలిసింది. పాట మార్చమని అడిగితే, అవతలి వారు అంగీకరించకపోవడంతో వివాదం రేగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆవేశంతో తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో యోగేంద్ర, చోటూ అనే వ్యక్తులు చనిపోయారు. మరో వ్యక్తి క్షతగాత్రుడయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.