: వస్త్రధారణపై ఎమ్మెల్యే మందలింపు.. కుప్పకూలిన మహిళా కబడ్డీ కోచ్
'మీ దుస్తులు బాగాలేవు' అని ఓ ఎమ్మెల్యే.. మహిళా కబడ్డీ కోచ్ ను మందలించగా.. ఆమె కళ్ళు తిరిగి కిందపడిపోయిన సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది. గుర్గావ్ లోని ద్రోణాచార్య కళాశాల వార్షికోత్సవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు ధరమ్ పాల్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అదే కాలేజీలో జాతీయస్థాయి కబడ్డీ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత సునీల్ దబాస్ వ్యాయామ విద్యా విభాగం అధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వార్షికోత్సవానికి దబాస్ టాప్, ప్యాంట్ తో హాజరయ్యారు.
ఇక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ధరమ్ పాల్ మాట్లాడుతూ, 'మీ దుస్తులు బాగాలేవు, ఇలాంటి కార్యక్రమానికి వేసుకురావాల్సిన దుస్తులవి కావు' అని దబాస్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారట. ఆ సమయంలో కళాశాల మహిళా సిబ్బందిలో దబాస్ తప్ప అందరూ సంప్రదాయ దుస్తులే ధరించడంతో ఆమె ఒక్కతే విభిన్నంగా కనిపిస్తోంది. తనను ఎమ్మెల్యే మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దబాస్ కాసేపటి తర్వాత కళ్ళు తిరిగి వేదిక మీది నుంచి కిందపడిపోయింది.
దీంతో పోలీసులు వెంటనే ఆమెను మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై ఎమ్యెల్యే ధరమ్ పాల్ మాట్లాడుతూ, తాను కూడా అదే కాలేజి విద్యార్థినని చెబుతూ, ఓ తండ్రిలా ఆమెను మందలించానని వివరణ ఇచ్చారు. కానీ, ఆ కళాశాల విద్యార్థులు మాత్రం ఎమ్మెల్యే వేధించడం వల్లే తమ ఉపాధ్యాయిని కళ్ళు తిరిగి కింద పడిపోయిందని ఆరో్పిస్తూ నిరసన వ్యక్తం చేశారు.