: ఈ-తత్కాల్ చాలా ఫాస్ట్ గురూ!
తత్కాల్ టిక్కెట్లు తీసుకునే రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఈ-తత్కాల్ బుకింగ్ వేగాన్ని పెంచుతూ రైల్వే సంస్థ ‘ఐఆర్ సిటిసి లైట్’ అనే నూతన వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 10 గంటలకు తత్కాల్ బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికి 30 నిమిషాల ముందే ఈ సైట్ లో బుకింగ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి రెండు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సైట్ లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు, బొమ్మలు, రైల్వే సేవల వివరాలు, పాప్ అప్ విండోలు ఉండవు. దీంతో సైట్ లో ట్రాఫిక్ తగ్గి, టిక్కెట్ల విక్రయ వేగం పెరుగుతుందని అధికారులు చెప్పారు. ఈ వెబ్ సైట్ ను ప్రయాణికుల సౌలభ్యం కోసం రూపొందించినట్లు, ట్రావెల్ ఏజెంట్లు ఈ సైట్ లో టిక్కెట్ బుక్ చేసేందుకు వీల్లేదని రైల్వే అధికారులు చెప్పారు. అయితే, బుక్ చేసుకున్న టిక్కెట్లను కాన్సిల్ చేసేందుకు వేరొక లింకును ఐఆర్ సీటీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.
ఇంతకు ముందున్న ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ప్రతి రోజూ 5 లక్షల వరకు టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. దాంతో సైట్ లో ట్రాఫిక్ పెరిగి, వెబ్ పేజీ తెరుచుకునేందుకే చాలా సమయం పడుతోంది. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి నిరీక్షణ తప్పడం లేదు. అందుకే, ఇప్పుడు తత్కాల్ టిక్కెట్ల కోసమే ఈ కొత్త వెబ్ సైట్ ను నెటిజన్లకు అందుబాటులో ఉంచారు.