: నైజీరియాలో విద్యార్థుల ఊచకోత
ఆఫ్రికా దేశం నైజీరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదం మరోసారి జడలు విప్పింది. నిషేధిత బోకో హరామ్ మిలిటెంట్లు మంగళవారం ఓ పాఠశాల హాస్టల్ భవనంపై దాడి చేసి 59 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్నారు. యోబె రాష్ట రాజధాని దమతురుకు సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో కొందరి శరీరాలు కాలి బూడిదయ్యాయి. మిలిటెంట్లు కాల్పులు జరిపిన సమయంలో అగ్నికీలలు ఎగిసి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మరికొందరు విద్యార్థుల దేహాలు సమీపంలోని పొదల్లో లభ్యమయ్యాయి. పారిపోయే క్రమంలో వారు బుల్లెట్ గాయాలతో మరణించి ఉంటారని అధికారులు తెలిపారు. పాఠశాల ప్రాంగణంలోని 24 భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వాటిలో సిబ్బంది వసతి గృహాలు కూడా ఉన్నాయి.