: సినీ నటి బ్యాగులో బుల్లెట్.. నాలుగు గంటలు విచారణ!
ఓ సినీ నటి బ్యాగులో సాధారణంగా మేకప్ కిట్, వ్యక్తిగత వస్తువులు ఉంటాయనుకున్న విమానాశ్రయ సిబ్బందికి బుల్లెట్ కనిపించడంతో కంగుతిన్నారు. వెంటనే అదుపులోకి తీసుకుని నాలుగు గంటల పాటు విచారించి అన్ని విషయాలు తెలుసుకుని వదిలిపెట్టారట. ఇంతకీ ఎవరా నటి, ఆమె బ్యాగులో బుల్లెట్ ఎందుకుందన్న వివరాల్లోకి వెళితే. ఇటీవల 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న భామ రకుల్ ప్రీత్. ఓ వారం కిందట ముంబై వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లిన రకుల్ లగేజ్ ను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. లగేజీలోని ల్యాప్ టాప్ బ్యాగులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించి క్షుణ్ణంగా వెతకడంతో బుల్లెట్ బయటపడింది. రకుల్ సహా అధికారులు బుల్లెట్ ను చూసి ఆశ్చర్యపడ్డారు.
వెంటనే విమానాశ్రయ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి విచారించగా.. అది 8ఎంఎం బుల్లెట్ అని ఆమె చెప్పిందట. దానిపై రకుల్ మాట్లాడుతూ.. ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని, వెంటనే ఆర్మీలో పనిచేసే తన తండ్రిదనుకుని పిలిచానని తెలిపింది. అయితే, ఆ బుల్లెట్ తనది కాదని, అసలు ఇండియాలో ఇలాంటి బుల్లెట్ తయారుచేయరని పోలీసులకు చెప్పారట. చివరికది డెడ్ బుల్లెట్ అని పోలీసులు తేల్చారట. అయితే, బుల్లెట్ తన సంచిలోకి ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా.. తీవ్రంగా ఆలోచించి రెండు రోజుల కిందట తాను బ్యాంకాక్ నుంచి వచ్చానని, అప్పుడు ఎవరయినా తన బ్యాగులో పడేసి ఉంటారని పోలీసులకు చెప్పినట్లు వివరించింది.