: రజనీ కటాక్షం ఎవరికి?
రజనీకాంత్... తమిళనాడు రాజకీయాలను కనుసైగలతో శాసించగల ఓ శక్తి. ఆయన ఓ పిలుపు ఇస్తే ద్రవిడ పార్టీల స్థితిగతులు తారుమారైపోతాయి. ఆయన కటాక్షం కోసం జాతీయ పార్టీలు సైతం తపించిపోతాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో, ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ... అందరి దృష్టి సూపర్ స్టార్ రజనీపై కేంద్రీకృతమై ఉంది. ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దీనికితోడు, రజనీ అభిమానులు చేస్తున్న హడావిడి చర్చనీయాంశమైంది. చెన్నై, సేలంలో వారు అభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు. ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారన్న సమాచారం సేకరిస్తున్నారు.
1996లో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి రజనీ మద్దతు పలికారు. తర్వాత ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారు. గత ఎన్నికల్లో మంచి పాలన అందించే పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, రజనీ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికి తోడు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో రజనీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు రజనీ నోటి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆయన అభిమానులు చేపట్టిన అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత, రజనీ ఓ నిర్ణయానికి వస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.