: వంట గ్యాస్ అయిపోతే... రేపు ఉదయం నుంచి ఇక కష్టమే!
వంట గ్యాస్ అయిపోతే... మంగళవారం నుంచి అంతే సంగతులు! రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ డీలర్లు రేపు ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయనున్నారు. దీంతో, అత్యవసరంగా గ్యాస్ కావాలన్నా దొరకని పరిస్థితి నెలకొంది. ఇంతకాలం, గ్యాస్ సరఫరాకు ఆధార్, బ్యాంక్ ఖాతా అంటూ తిప్పలు పడిన వినియోగదారులకు... ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. గ్యాస్ డీలర్లు, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపంతో గ్యాస్ సరఫరా నిలిచిపోనుంది. గ్యాస్ డీలర్ల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి 70 లక్షల మంది వినియోగదారులకు సిలిండర్ల సరఫరా ఆగిపోతోంది. గ్యాస్ డీలర్లపై కొత్తగా విధించిన ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేయాలంటూ వారు సమ్మెకు దిగుతున్నారు. ఈ సమ్మెలో 1170 మంది గ్యాస్ డీలర్లు పాల్గొంటారని గ్యాస్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు తెలిపారు.