: రాఖీ బిర్లాకు ఆమ్ ఆద్మీ లోక్ సభ టికెట్?
పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాఖీ బిర్లాకు లోక్ సభ టికెట్ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లోక్ సభకు పోటీ చేసే 20 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని రోజుల క్రితం మొదటి జాబితా విడుదల చేయగా, అతి త్వరలో మరికొందరి పేర్లతో రెండో జాబితా విడుదల చేయనుంది. ఇందులో రాఖీ బిర్లా పేరు కూడా ఉన్నట్లు సమాచారం బయటకు పొక్కింది. దాంతో పార్టీ కార్యకర్తలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని హనుమాన్ రోడ్డులో పార్టీ కార్యాలయం ముందు ఆదివారం కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. టికెట్ కోసం రాఖీబిర్లా దరఖాస్తు చేసుకోకపోయినా ఆమెకు టికెట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. పైగా ఎమ్మెల్యేలకు లోక్ సభ టికెట్లు ఇవ్వమని ప్రకటించి ఇప్పుడు ఆమె పేరును పరిగణనలోకి తీసుకోవడం ఏమిటంటూ మండిపడుతున్నారు.