: భారత్ చేరుకున్న ఇటలీ నావికులు
కేరళ మత్స్యకారులను చంపిన కేసులో నిందితులైన ఇటలీ నావికులు మాస్సిమిలియానో లాటోరే, సాల్వటోర్ గిరానే నాటకీయ పరిణామాల మధ్య భారత్ చేరుకున్నారు. వారికి మరణశిక్ష విధించబోమంటూ కేంద్రం హామీ ఇచ్చిన మీదట వారిద్దిరినీ భారత్ కు అప్పగించాలని ఇటలీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
కాగా, గత నెలలో వారిద్దరూ ఇటలీలో ఎన్నికలు జరుగుతున్నందున ఓటేసేందుకని స్వదేశం వెళ్ళారు. సుప్రీంకోర్టు కొన్ని షరతులతో వారికి ఇటలీ వెళ్ళేందుకు అనుమతించింది. అయితే, వారు సొంతగడ్డ చేరుకోగానే ఇటలీ ప్లేటు ఫిరాయించింది.
వాళ్ళిద్దరినీ భారత్ పంపేదిలేదని తెగేసి చెప్పింది. అంతర్జాతీయంగా పలు ఒత్తిళ్ళు రావడం, భారత్ లో ఇటలీ రాయబారిపై ఆంక్షలు విధించడం, తాజాగా కేంద్రం మరణశిక్ష విధించబోమని హామీ ఇచ్చిన నేపథ్యంలో వారిద్దరినీ ఇటలీ తన వైమానిక దళ విమానంలో భారత్ తరలించింది. వారిద్దరూ మార్చి 22లోగా భారత్ చేరుకోవాలని సుప్రీం విధించిన గడువు నేటితో ముగిసింది.