: పద్మాలయ స్టూడియోకు భూమి కేటాయింపు రద్దు చేయండి: కలెక్టర్
నటుడు కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియో భూవివాదంలో చిక్కుకుంది. ఈ స్టూడియోకు ప్రభుత్వ భూముల కేటాయింపు రద్దు చేయాలని హైదరాబాద్ జిల్లా అధికార వర్గాలు నిర్ణయించుకున్నాయి. ఈమేరకు హైదరాబాద్ కలెక్టర్ ముకేశ్ కుమార్ మీనా భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ కు ఓ లేఖ రాశారు. ఈ వివాదం పూర్వాపరాల్లోకి వెళితే.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1982లో షేక్ పేట మండలంలో స్టూడియో నిర్మాణానికి గాను నామమాత్రపు ధరకే 9 ఎకరాలు కట్టబెట్టింది. అక్కడ నాలుగు ఎకరాలలో పద్మాలయ స్టూడియో నిర్మించిన కృష్ణ... మిగతా ఐదు ఎకరాలను 2007లో జీ టెలిఫిలింస్ తో పాటు మరో 13 మందికి విక్రయించారు.
ప్రభుత్వం స్టూడియో నిర్మాణానికి కేటాయించిన భూములను ఇలా విక్రయించడం చెల్లదని ప్రభుత్వం పద్మాలయ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు పంపింది. దీనిపై, పద్మాలయ యాజమాన్యం వాదిస్తూ, ఒకసారి ప్రభుత్వం నుంచి తమ పరమైన తర్వాత ఆ భూమిపై సర్వహక్కులూ తమవే అవుతాయని పేర్కొన్నారు. కానీ, ఓ నిర్దిష్ట ప్రయోజనం కోసం ఆ భూమిని కేటాయించామని, విక్రయించడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అప్పటి నుంచి ఆ వివాదం నడుస్తుండగా, తాజాగా ఈ కేసును మరోసారి విచారించాలని, ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని హైదరాబాద్ కలెక్టర్ ముకేశ్ కుమార్ మీనా భూ పరిపాలన శాఖను కోరుతున్నారు. త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్టు మీనా చెప్పారు.