: మన్మోహన్ ను ఏ కోణంలో చూసినా నాయకుడు కనిపించడం లేదు: జైట్లీ
యూపీఏ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మండిపడ్డారు. యూపీఏ నాయకత్వ లోపంలో కూరుకుపోయిందని... దాన్ని సమర్థవంతంగా నడిపించేవారే లేరన్నారు. ప్రధానమంత్రిని ఏ కోణంలో చూసినా నాయకుడిగా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలోని ఏ వర్గానికి కూడా యూపీఏపై విశ్వాసం లేదని అన్నారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఏ హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలతో కాంగ్రెస్ పరువు బజారున పడిందని అన్నారు. రూపాయి విలువ పతనమవుతున్నా, దాన్ని నివారించేందుకు కనీస చర్యలు కూడా తీసుకోలేదని విమర్శించారు.