: కాంగ్రెస్, బీజేపీ నయవంచనకు గురి చేశాయి: అశోక్ బాబు
అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవిస్తామని చెప్పిన భారతీయ జనతాపార్టీ మోసం చేసిందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు. పార్లమెంటులో బీజేపీ సహకారంతో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును నెగ్గించుకున్నారని ఆయన తెలిపారు. హైదరాబాదులోని ఏపీఎన్జీవో భవన్ లో ఈరోజు (శనివారం) అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో బీజేపీ కనీసం సవరణలను కూడా ప్రతిపాదించలేదని ఆయన విమర్శించారు. బిల్లుపై రాజ్యసభలో బీజేపీ ఇచ్చిన సవరణలను కేంద్రం అంగీకరించలేదని ఆయన అన్నారు. విభజన విషయంలో మోసం చేసిన నేతలను రానున్న తరాలు క్షమించవని ఆయన తెలిపారు.
సమైక్య రాష్ట్రం కోసం ఉద్యోగ సంఘాలు శక్తికి మించి పోరాడాయని అశోక్ బాబు చెప్పారు. రాష్ట్రం కలిసి ఉండాలని చివరి వరకూ పోరాడిన సంతృప్తి తమకు ఉందని ఆయన అన్నారు. ప్రజల పక్షాన నిలబడాలన్నదే తమ భావన అని ఆయన చెప్పారు.