: కొడుకు, కుమార్తెల ఎంపీ సీట్లకోసమే ప్రణబ్ మా గొంతు కోశారు: దేవినేని ఉమా
50 ఏళ్ల రాజకీయానుభవం ఉండి కూడా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర విభజన విషయంలో సరైన రీతిలో వ్యవహరించలేకపోయారని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. కేవలం తన కుమారుడు, కూతురు ఎంపీ సీట్ల కోసం కక్కుర్తి పడే ఆయన ఇలా చేశారని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రథమ పౌరుడే సీమాంధ్రుల గొంతు కోస్తే, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎవరు కాపాడాలని ప్రశ్నించారు. రూ. 20 లక్షల కోట్లు ఇచ్చినా హైదరాబాదుని ఇలా నిర్మించలేమని... 57 ఏళ్లు అభివృద్ధి చేస్తేనే ప్రస్తుత హైదరాబాద్ నిర్మితమైందని చెప్పారు. అలాంటి హైదరాబాదుపై తమకు హక్కు లేదా? అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జలాల కోసం తాము ఢిల్లీ వెళ్లి అడుక్కోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.