: మాకు తెలుసు మిమ్మల్ని ఎక్కడికి పంపాలో...!: సహారా అధినేతకు సుప్రీం వార్నింగ్


సహారా అధినేత సుబ్రతా రాయ్ పై నేడు సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మదుపరులకు కోట్ల విలువైన వాటాల ఎగవేత కేసులో కోర్టుకు హాజరైన సుబ్రతా రాయ్, మరో ముగ్గురు డైరక్టర్లను ఉద్దేశించి.. 'మీపై నమ్మకం పోయింది. మాకు తెలుసు మిమ్మల్ని ఎక్కడికి పంపాలో..' అంటూ వ్యాఖ్యానించింది. సంస్థ ఆస్తులను విక్రయించేందుకు సెబీకి సహారా అనుమతి నిరాకరించిన నేపథ్యంలో సుప్రీం తాజా వ్యాఖ్యలు చేసింది. సహారాకు చెందిన రెండు అనుబంధ సంస్థల ఆర్ధిక పథకాలు అక్రమమని, రూ.24,000 కోట్ల మేర చిన్న తరహా వాటాదారులకు చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం 2012 ఆగస్టులో సహారాను ఆదేశించిన సంగతి తెలిసిందే.

కాగా, సహారా సంస్థ ఖాతాదారులను మభ్యపెట్టే రీతిలో, తమ బాండ్లు తీసుకుంటే పదేళ్ళలో వాటి ముఖ విలువకు మూడింతల సొమ్ము ఇస్తామని పెద్ద ఎత్తున నిధులు సేకరించింది. ఈ ప్రక్రియలో అది సెబీ నిబంధనలు ఉల్లంఘించినట్టు వెల్లడైంది. కాగా, నేటి విచారణ అనంతరం సుప్రీం కోర్టు ఈ కేసును ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News