: సమాచార కమిషనర్ల ఎంపికపై గవర్నర్ కు లేఖ: పద్మనాభయ్య
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినే సమాచార కమిషనర్లుగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అనుకూలమైన ఇంతియాజ్ అహ్మద్, తాంతియా, విజయనిర్మల, వర్రె వెంకటేశ్వర్ల ను గత సంవత్సరం కిరణ్ ప్రభుత్వం సమాచార కమిషనర్లుగా ఎంపికచేయగా గవర్నర్ నరసింహన్ తిరస్కరణతో అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వారినే ఎంపిక చేయడాన్ని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య తీవ్రంగా ఖండించారు.
ఇది ఏ మాత్రం సరికాదన్నారు. కమిషనర్లను ఎంపిక చేయడంలో ప్రతిపక్షాల పాత్ర ముఖ్యమని ఆయన చెప్పారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో సమాచార హక్కు చట్టం‘పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన పద్మనాభయ్య, కమిషనర్లను ఎంపిక చేయడంలో ప్రతిపక్ష నేతకు కేవలం గంటల ముందు సమాచారాన్ని ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ అంశంపై గవర్నర్ కు లేఖ రాస్తానన్నారు. రాజకీయలతో సంబంధాలున్న వారికే పట్టంకడితే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.