: భవిష్యత్తులో 'అవతార్' డాక్టర్లొస్తారు!
జేమ్స్ కేమరాన్ అల్టిమేట్ మూవీ అవతార్ లో మనిషి మరో రూపంలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. సరిగ్గా అలానే.. భవిష్యత్తులో వైద్యులు మెడికల్ యాప్ లలోకి పరకాయ ప్రవేశం చేయనున్నారు. ఎలాగంటారా.. అయితే రాబిన్ కుక్ మహాశయుడు చెప్పేది వినాల్సిందే. ఈ అమెరికా వైద్యుడు చేయితిరిగిన రచయిత కూడా. 'కోమా', 'అవుట్ బ్రేక్' వంటి బెస్ట్ సెల్లర్స్ ఈయన కలం నుంచి జాలువారాయి. తాజా పుస్తకం 'సెల్' ఈ నెల మొదటి మార్కెట్లోకి వచ్చింది. ఈ పుస్తకంలో ఆయన అవతార్ డాక్టర్ యాప్ గురించి చర్చించారు.
ఇప్పటివరకు 50,000 మెడికల్ యాప్ లు అందుబాటులో ఉండగా, వాటన్నింటినీ క్రోడీకరిస్తే 'మీరూ ఓ అవతార్ డాక్టరే' అని అంటున్నారు కుక్. నిజజీవిత వైద్యుల కంటే ఈ వర్చువల్ వైద్యులే కచ్చితంగా వ్యవహరిస్తారని, వేలకొద్దీ అధ్యయనాలను చిటికెలో విశ్లేషించగల సామర్థ్యం దృష్ట్యా ఇది సాధ్యపడుతుందని కుక్ చెప్పారు.
మనకు వాటిల్లే అనారోగ్యంపై తగిన సూచనలు, సలహాలు ఇస్తుందట అవతార్ డాక్టర్. ఇందుకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలని, భవిష్యత్తులో వచ్చే ఈ యాప్ ద్వారా ఓ డాక్టర్ మన చెంత ఉన్నట్టే అని ఈ డాక్టర్ కమ్ రైటర్ వివరించారు. హార్ట్ ఎటాక్ వస్తే వెంటనే ఈసీజీ, బ్రీతింగ్ రేట్ పరిశీలించి తగిన చర్యలు సూచిస్తుందని కుక్ వివరించారు.