: ఒబామా కారులో డీజిల్ కు బదులు పెట్రోల్ పోశారట!


ఇటీవలే ఇజ్రాయెల్ పర్యటన సాగించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అక్కడ ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆయన వినియోగిస్తున్న లిమోసిన్ వాహనం డీజిల్ తో నడుస్తుంది. అయితే, పొరబాటున దాంట్లో పెట్రోల్ నింపడంతో చిక్కొచ్చిపడింది. ఇంధనం మార్పుతో ఆ లిమోసిన్ మొండికేసిందట. వెంటనే అధ్యక్షుల వారు వేరే కార్లోకి మారారు.

ప్రపంచంలో అత్యంత భద్రత కలిగి ఉండే వ్యక్తి అయిన ఒబామా అలా నడిరోడ్డుపై మరో కార్లోకి మారడం చూపరులకు ఆశ్చర్యం కలిగించింది. మొరాయించిన లిమోసిన్ ను వెంటనే టెల్ అవీవ్ సమీపంలోని  ఓ షెడ్డుకు తరలించారు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగిస్తాడంటే, ఆ కారుకు కొన్ని ప్రత్యేకతలు ఉండాల్సిందే. ఈ పొడవాటి లిమోసిన్ కారును ముద్దుగా 'ద బీస్ట్' అని పిలుస్తారు.

అమెరికాలోని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటార్స్ డిజైన్ చేసిన ఈ కారు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. రసాయన దాడులు, రాకెట్ లాంచర్ల దాడులు ఈ కారును ఏమీ చేయలేవు. ఈ కారులో అధ్యక్షుడి గ్రూప్ రక్తాన్ని కూడా అందుబాటులో ఉంచుతారు. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఈ కారు సొంతం.

నిరంతరం వైట్ హౌస్ కు అనుసంధానం అయ్యేలా శాటిలైట్ ఫోన్ సౌకర్యం ఉంటుంది. ఇంతకీ కారు ధర చెప్పనేలేదు కదూ.. రెండున్నర కోట్ల రూపాయల పైచిలుకే. ఒకవేళ కారు టైర్లు పేలిపోయినా, 60 కిలోమీటర్ల వరకు ఢోకా లేకుండా ప్రయాణిస్తుందిట.. నిజంగా ఇది బీ(బె)స్టే కదూ!

  • Loading...

More Telugu News