: అతడి కిడ్నీని ఆమె అమ్మేసింది..!


‘అప్పుల పాలయ్యాను.. ఆదుకోండి‘ అంటూ ఆమె అతడిని నమ్మించింది. దాంతో సాయం చేసేందుకు సరేనన్నాడు. అవసరాలు తీర్చేందుకు కిడ్నీని అమ్మేందుకు సిద్ధపడ్డాడు. అయితే, ఆపరేషన్ అయ్యాక కిడ్నీని దళారుల సాయంతో అమ్మివేసి.. ఆనక అతడిని ఆసుపత్రిలోనే వదిలేసిన ఆమె, అక్కడి నుంచి జారుకుంది. ఈ ఘటన గతేడాది అక్టోబరులో జరిగింది. జరిగిన మోసాన్ని గ్రహించిన అతడు.. ఇప్పుడు మీడియాను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అయితే.. అడగగానే అమ్మేందుకు కిడ్నీని ఇచ్చేస్తారా? అని అనుకుంటున్నారా. అవును, మీ సందేహం కరెక్టే. కాని, ఈ ఘటనలో బాధితుడు భర్త. అతడి కిడ్నీని అమ్మేసింది భార్యే. సహధర్మచారిణి కదా సాయం చేద్దామనుకున్నానని.. అయితే తనకు చేదు అనుభవమే జరిగిందని బాధితుడు వాపోయాడు. బాధితుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన కృపారావుకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన గౌరీదేవితో పదేళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ఎనిమిదేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. గౌరీదేవి ప్రవర్తన సరిగా లేదంటూ అతను దూరంగా ఉంటున్నాడు. పిల్లలు తల్లి దగ్గరే ఉంటున్నారు.

కొంతకాలంగా దూరంగా ఉన్న గౌరీదేవి భర్తకు ఫోన్ చేసి తనకు 3 లక్షల అప్పులున్నాయని, వాటిని తీర్చాలని వేడుకొంది. కిడ్నీ అమ్మితే 5 లక్షలు ఇస్తారని, దాంతో సమస్యలన్నీ తీరుతాయని ఆమె నమ్మబలికింది. పిల్లల కోసం కృపారావు అందుకు సమ్మతించాడు. గత అక్టోబరులో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుని కిడ్నీ అమ్మేసుకున్నాడు. వచ్చిన 5 లక్షలు తీసుకుని ఆమె అతడిని వదిలేసి వెళ్లిపోయింది. చివరకు ఆసుపత్రి వారు గెంటేయడంతో కృపారావు ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రమోద్ కుమార్ కు పది రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐని కలవగా.. ఆయన కేసు తన పరిధిలోకి రాదన్నాడు. విశాఖలోనే కేసు పెట్టాలని సూచించడంతో దిక్కుతోచక చివరకు అతడు తన గోడును మీడియాకు మొరపెట్టుకున్నాడు.

  • Loading...

More Telugu News