: కేజ్రీవాల్ పదవీచ్యుతుడు కావడానికి వాస్తే కారణమా?
ఊహకందని రీతిలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ చరిత్రలో తనకంటూ ఓ పేజీ రాసుకున్నారు. మరి 49 రోజుల్లోనే ఆయన అధికారం కోల్పోవడం విధి రాతా? వాస్తు కారణమా? కేజ్రీవాల్ తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఇటీవలి వరకు ఘజియాబాద్ లోని కౌశాంబి లో ఉన్నారు. తన భార్యకు కేటాయించిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఫ్లాట్ లో కుటుంబ సభ్యులతో కలసి నివసించారు. 15 రోజుల క్రితమే ఢిల్లీలోని తిలక్ మార్గంలో ఉన్న కొత్త అధికారిక నివాసానికి మారారు. అందులోకి వచ్చిన రెండు వారాలకే ఆయన మాజీ అయిపోయారు. దీనికి వాస్తు కారణమై ఉండొచ్చని ఒక అభిప్రాయం.
అయితే, ప్రస్తుతం తాను నివసిస్తున్న తిలక్ మార్గంలోని అధికారిక నివాసంలో ఏప్రిల్ వరకూ కొనసాగుతానని కేజ్రీవాల్ చెప్పారు. తన కూతురు పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ఈ సమయంలో ఇల్లు మారడం ఆమె చదువులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే, ఇండియన్ రెవెన్యూ అధికారి అయిన తన భార్యకు ప్రమోషన్ రానున్నదని, వస్తే ప్రస్తుతం తానుంటున్నటువంటి ఇల్లునే ప్రభుత్వం కేటాయిస్తుందని.. కనుక ఇప్పుడున్న ఇల్లునే తమకు కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు. అధికారం నుంచి వైదొలగాక సీఎం 15 రోజుల పాటు అదే ఇంటిలో ఉచితంగా ఉండవచ్చు. ఆ తర్వాత గరిష్ఠంగా ఆరు నెలలపాటు అద్దె చెల్లించడం ద్వారా కొనసాగింపు పొందవచ్చు.