: స్పీకర్ పై విరుచుకుపడ్డ మోదుగుల.. సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్
లోక్ సభలో చోటుచేసుకున్న ఘటనకు బాధ్యులుగా సీమాంధ్ర టీడీపీ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేయడంపై ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తమను సభ నుంచి సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం, అమానుషమన్నారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇతర పార్టీ నేతలను కలుస్తామని చెప్పారు. మా భిక్షతో స్పీకరై మమ్మల్నే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు.
ఇక లోక్ సభలో ఘటనకు తొలి ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి స్పీకర్, మూడో ముద్దాయి జగన్ అన్న మోదుగుల బిల్లును సభలో పెట్టలేదన్న ప్రతిపక్ష నేతల అభిప్రాయాన్ని ప్రభుత్వం, స్పీకర్ గౌరవించాలన్నారు. అప్పుడు తమపై సస్పెన్షన్ ఎత్తివేసి బిల్లును సభలో మళ్లీ ప్రవేశపెట్టాలని కోరారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేస్తే అప్పుడు తెలంగాణను పువ్వుల్లో పెట్టి ఇస్తామన్నారు. జగన్ పక్కా విభజన వాది అని, తనపై దాడి జరుగుతుంటే కనీసం వైఎస్సార్సీపీ సభ్యులు అడ్డుకునేందుకు రాలేదన్నారు.