: ప్రేమ=ప్రేమ


నేడు ప్రేమికుల దినోత్సవం. అయితే ఏంటంట..? అని ఛాందస వాద పార్టీలు ప్రశ్నించవచ్చు. అంతర్లీనంగా మనుషులను నడిపించే ఈ విశ్వజనీన భావనను విస్మరించి ఎలా ఉండగలం? మనసులేని రాతిబండలం కాదుకదా..! అందుకే ఈ స్మరణ. ప్రేమ ... ఈ రెండక్షరాల పదం నాలుగు రకాలు అనుకుంటే.. ఒకటి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, రెండోది యువతీ యువకుల మధ్య ప్రేమ, మూడోది సమాజంలో వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ, నాల్గవది జంతువులకు మనుషులకు మధ్య ఉండే ప్రేమ అని వర్గీకరించవచ్చు. నేడు ఫిబ్రవరి 14.. ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం యువతీ యువకుల మధ్య ప్రేమ గురించే!

ఎప్పుడో సెయింట్ వాలెంటైన్ మహానుభావుడు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రేమికులను ఒక్కటి చేసేందుకు ఉద్యమించిన రోజు ఇది. అందుకే ఆయన పేరిట మన ప్రేమకు కొత్త రెక్కలు తొడుక్కుంటాం. అందినంత ఎత్తుకు ఎగరాలని ప్రయత్నిస్తాం. కొందరు గమ్యాన్ని చేరతారు, మరికొందరు మధ్యలోనే అలసిపోతారు. ఇంకొందరు లోకానికి జంకి నిల్చున్నచోటనే ఉండిపోతారు.

కుటుంబంలోగానీ, సమాజంలోగానీ 'నువ్వు, నేను' అనుకుంటే అది స్వార్థం. కానీ.. ప్రేమలో ఉండేది 'నువ్వు-నేనే'..! దీన్ని తప్పని చెప్పలేం. అదే మరి, రెండక్షరాల మహిమ. అలాంటి ప్రేమకు వేరే అర్థం ఉండదు, ప్రేమకు ప్రేమే పరమార్థం. త్యాగాన్ని కోరుతుందంటే.. భాగస్వామిలో ఉండే దుర్గణాలను త్యజించమని అర్థం. గౌరవించు అంటే.. భాగస్వామిలోని లోపాలనూ మన్నించాలని అర్థం. కానీ, నేడు లవ్ అంటే ఓ ప్యాషన్. కాలేజి స్టూడెంట్లయితే అది తప్పనిసరి అన్న ఫీలింగ్. టీనేజ్ ఆరంభంలోనే వారు ఈ మహోన్నత శిఖరం పైభాగాన కాలుపెట్టాలని భావిస్తారు. తాము నేలపై నిల్చుని ఎవరెస్టు అంత ఎత్తున్న ఆ అపురూప భావనను అందుకోవడం అసాధ్యమని తెలుసుకునే ఆ అపరిపక్వ ప్రేమలు ముగిసిపోతాయి.

వయసుతోపాటే పరిణతి చెందిన వ్యక్తులకు, తమ అభిరుచులు కలిసిన వ్యక్తులు తారసపడిన నాడు కలిగే స్పందన=ప్రేమ. నిశ్చలంగా ఉన్న తటాకం మీదుగా చిరుగాలి వీస్తే ఆ నీటిలో కలిగే ప్రకంపనలు, క్రమంగా చిరుచిరు అలలను సృష్టిస్తాయి. అవి తీరాన్ని సైతం సుతారంగానే తాకుతాయి. కానీ, అదే నీటిపై పెనుగాలి వీస్తే ఆ తాకిడికి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. తీరాన్ని సైతం ముంచెత్తుతాయి. ప్రేమ కూడా ఇంతే. తొలి ఉపమానం పరిపక్వ ప్రేమకు నిదర్శనం కాగా, రెండోది అపరిపక్వ ప్రేమను సూచిస్తుంది.

ప్రేమంటే మన గుండె మాటున దాగిన మధుర భావనలను తట్టిలేపాలి, ప్రేమంటే మన మనసును పట్టి వేధించే వేదనలను కూకటివేళ్ళతో పెకలించగలిగే తీవ్రతనూ కలిగి ఉండాలి. మరి, ఆ ప్రేమకు భేదాలు తెలీవు. మురికివాడల్లో పుట్టే ప్రేమైనా, చలువరాతి మేడల్లో జనించే ప్రేమైనా.. ప్రేమికుల మెదళ్ళలో ఒకే విధమైన రసాయనిక చర్యను కలిగిస్తుంది, ఏకరూప హార్మోన్లను విడుదల చేస్తుంది. తేడా అంతా మనుషుల్లోనే, వారి మనసుల్లోనే.

  • Loading...

More Telugu News