: ప్రేమికుల దినోత్సవాన.. పోరాడి ఓడిన ప్రేమ!
అవును.. ప్రేమ ఓడిపోయింది. అక్కడ జరిగిన వంచనకు ప్రేమ తలవంచింది. ప్రియుడు, అతని తల్లిదండ్రుల అకృత్యానికి ఆమె బలైపోయింది. కాలిన గాయాలతో.. ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలు కన్నుమూసింది. ‘వాలెంటైన్స్ డే’కు ఓ రోజు ముందే ఆ అభాగ్యురాలు కన్నుమూయడం అందరి హృదయాలను కలచివేసింది.
హైదరాబాదు గాంధీనగర్ లోని ఎస్ బీహెచ్ కాలనీ వాసి జంగా షీలా (21), రాంనగర్లోని జెమినీ కాలనీకి చెందిన సాయి(20) ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నారు. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. షీలా తండ్రి ధర్మపురి మృతి చెందగా.. ఆమె ప్రస్తుతం తల్లితో కలిసి నివాసముంటోంది. చిక్కడపల్లిలోని ఓ కళాశాలలో లా కోర్సు చేస్తోండగా.. సాయి సీఏ చేస్తున్నాడు. అతని తండ్రి వ్యాపారి. తనను వివాహం చేసుకోవాలని నెల రోజులుగా షీలా సాయిని ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో సాయి ఇంటికి వెళ్లిన షీలాను అతని తల్లిదండ్రులు దూషించడంతో ఆమె అక్కడికక్కడే నిప్పంటించుకుంది.
86 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం ప్రాణాలు కోల్పోయింది. దీంతో మొదట పోలీసులు ప్రియుడు సాయి, అతని కుటుంబ సభ్యులపై ఐపీసీ 307 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఇప్పుడు షీలా చనిపోవడంతో ఈ కేసును హత్యగా (సెక్షన్ 302) మార్చారు. మృతురాలు ఎస్సీ కావడంతో అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. నిందితులందరినీ అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.