: స్పీకర్ చదవకుండానే బిల్లు సభలోకి ఎలా వచ్చింది?: లగడపాటి
పెప్పర్ స్ప్రేతో లోక్ సభలో హల్ చల్ చేసిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హోం మంత్రికి తెలియకుండానే, స్పీకర్ చదవకుండానే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఎలా సభలో ప్రవేశపెడతారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని దేశంలోని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. స్వపక్షానికి చెందిన నేతలను వదిలేసి, నిత్యం విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలను పిలిచి మాట్లాడతారా? అంటూ మండిపడ్డారు. సొంత పార్టీ నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారని ఎందుకు ఆలోచించరు? అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాంతీయ విద్వేషాలను ఎగదోసి కాంగ్రెస్ ప్రజలను విభజించాలని చూస్తోందని ఆరోపించారు. బిల్లు ప్రవేశపెట్టినట్టు ప్రతిపక్షం రికార్డులు చూపించమంటోందని, మరి ప్రభుత్వం ఎందుకు రికార్డులు చూపడంలేదని లగడపాటి నిలదీశారు. పార్లమెంటులో ఈరో్జు తమకు మద్దతు పెరిగిందని చెప్పారు. ప్రజల అభిప్రాయాన్ని సభలో చెప్పినంత మాత్రాన 17 మంది సభ్యులను సస్పెండ్ చేస్తారా? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ రాష్ట్ర విభజన ఎలా జరుగుతుందో చూస్తామని లగడపాటి సవాల్ విసిరారు.
కాగా, సభలో తన చుట్టూ చేరి కొందరు దౌర్జన్యం చేయబోయారని, అందుకే పెప్పర్ స్ప్రే చల్లానని వివరణ ఇచ్చారు. ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే చల్లడం తప్పెలా అవుతుందని అన్నారు.